మోదీని పొగిడిన సిద్ధరామయ్య

     Written by : smtv Desk | Tue, May 08, 2018, 05:30 PM

మోదీని పొగిడిన సిద్ధరామయ్య

బెంగళూరు, మే 8 : కన్నడ నాట ఎన్నికల సమరం కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీని పొగిడారు. అదేంటి తమ ముఖ్య ప్రతిపక్ష పార్టీ నాయకుడిని సిద్ధరామయ్య ఎందుకు పొగిడారో అనుకుంటున్నారా...? అయితే నిజంగా పొగడలేదులెండి టంగ్‌ స్లిప్‌ అయ్యింది అంతే. సిద్ధరామయ్య తమ పార్టీ నేత నరేంద్ర స్వామి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే నరేంద్ర స్వామి అనబోయి పొరపాటుగా ‘నరేంద్ర మోదీ’ అన్నారు. నరేంద్ర స్వామిని ప్రశంసించబోయి నరేంద్ర మోదీగా పేర్కొని ప్రశంసించారు.

గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఇళ్ల నిర్మాణం తదితర పనులు నరేంద్ర మోదీ, తమ ప్రభుత్వం వల్లే జరిగాయని చెప్పారు. వెంటనే స్వామి కలగజేసుకోవడంతో సిద్ధరామయ్య నాలుక కరుచుకుని ‘సారీ సారీ.. నరేంద్ర స్వామి’ అని చెప్పారు. నరేంద్ర అనే పదం ముఖ్యమైనదని అన్నారు. ‘స్వామి ఇక్కడ ఉన్నారు. మోదీ గుజరాత్‌లో ఉన్నారు. నరేంద్ర మోదీ ఫిక్షన్‌, నరేంద్ర స్వామి నిజం’ అని చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

గతంలో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఇలాంటి పొరపాటే చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పబోయి.. భాజపా నేత యడ్యూరప్ప పైనే విమర్శలు చేశారు. దీనిపై గతంలో సిద్ధరామయ్య స్పందిస్తూ.. భాజపా అధ్యక్షుడు తమ అభ్యర్థినే అవినీతిపరుడిగా పేర్కొన్నారని విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య కూడా అదే విధంగా పొరపాటుగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు.





Untitled Document
Advertisements