కరెంటు బిల్లు కట్టలేక.. వ్యాపారి ఆత్మహత్య

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 06:10 PM

కరెంటు బిల్లు కట్టలేక.. వ్యాపారి ఆత్మహత్య

ఔరంగాబాద్, మే 11 ‌: విద్యుత్ శాఖ ఉద్యోగి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. విధి నిర్వహణలో సుశీల్ కాశీనాథ్ అనే ఉద్యోగి చేసిన తప్పిదం వల్ల ఓ వ్యాపారి తనువు చాలించాడు. తను వినియోగానికి మించి అధిక మొత్తంలో బిల్లు రావడంతో నగదు చెల్లించే స్థోమత లేక జగన్నాథ్‌ నేహాజీ షెల్కే(36) అనే వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

వివరాల్లోకి వెళితే...జగన్నాథ్‌ నేహాజీ షెల్కే స్థానికంగా చిన్న కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం నెలవారీ విద్యుత్ బిల్లు రూ.1,000-2,000లోపు మాత్రమే వచ్చేది. కానీ ఈ సారి బిల్లు రూ.8.64లక్షలు వచ్చే సరికి ఆయన తట్టుకోలేకపోయాడు. ప్రతి నెలా నేహాజీ చెల్లించే బిల్లుతో పోలిస్తే ఇది దాదాపు 400 రెట్ల కంటే ఎక్కువే. ఈ మొత్తాన్ని నిర్దేశించిన సమయంలోపు చెల్లించాలని స్థానిక విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే స్థోమతకు మించి విద్యుత్‌ బిల్లు రావడంతో నేహాజీ మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో ఈ వివరాలన్నీ ఓ లేఖలో రాసి ఆయన గురువారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో, మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్‌ సరఫరా సంస్థ(ఎంఎస్‌ఈడీసీఎల్‌)కు చెందిన స్థానిక ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా విద్యుత్‌ బిల్లులో సంఖ్యలు తప్పుగా నమోదయ్యాయిని వెల్లడైంది. నేహాజీ ఇంటికి నెల మొత్తం మీద 6,117.8యూనిట్ల (రూ.2,803) విద్యుత్‌ ఖర్చవగా బిల్లులో మాత్రం 61,178 యూనిట్లు ఖర్చయినట్లు దీనికి గానూ రూ. 8.64లక్షలు చెల్లించాల్సిందిగా సుశీల్ కాశీనాథ్ అనే ఉద్యోగి రసీదు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తాహతుకు మించి విద్యుత్‌ ఛార్జీ చెల్లించాల్సి రావడంతో నేహాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ కాశీనాథ్‌ను విధుల నుంచి గురువారం సస్పెండ్ చేశారు.





Untitled Document
Advertisements