ప్రియుడే హతమార్చాడు..

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 08:27 PM

ప్రియుడే హతమార్చాడు..

హైదరాబాద్, మే 11 ‌: రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి రిసార్ట్‌లో డిగ్రీ విద్యార్థిని శిరీష దారుణ హత్యకు గురైంది. తనకు దక్కని శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే కోపంతోనే ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలంగా శిరీష, సాయి ప్రసాద్‌ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల శిరీష మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. దీంతో తట్టుకోలేక పథకం ప్రకారం రిసార్ట్‌కు పిలిచి హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి మీడియాకు వెల్లడించారు.

కొత్తూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన శిరీష బ్యాంకు పరీక్షలు రాసేందుకు శిక్షణ తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతి రోజూ దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్తొంది. రోజు మాదిరిగానే గురువారం శిక్షణ తరగతులకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఆమె మొబైల్‌కు ఫోన్‌చేయడంతో పోలీసులు మాట్లాడారు. జరిగిన విషయం వివరించి ఘటనాస్థలానికి పిలిపించారు. అక్కడికి చేరుకున్న వారు కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు ముందు నుంచి సాయిప్రసాద్‌పై అనుమానం ఉందని.. హత్య అతడే చేశాడని పోలీసులకు తెలిపారు.

శిరీష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టిన పోలీసులు సాయిప్రసాద్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధరణకు వచ్చారు. ప్రగతి రిసార్ట్స్‌లో గదిని ఆన్‌లైన్‌ ద్వారా ప్రసాద్‌ బుక్‌ చేసుకున్నాడని, శిరీష అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి గంటసేపు మాట్లాడుకున్న తర్వాత వారి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. వివాహానికి నిరాకరించడంతో సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడని డీసీపీ వివరించారు. నిందితుడికి ఇంకెవరైనా సహకరించారా? ఒక్కడే హత్య చేశాడా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Untitled Document
Advertisements