అమిత్ షా దాడిపై చంద్రబాబుదే బాధ్యత : లక్ష్మణ్

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 08:51 PM

 అమిత్ షా దాడిపై చంద్రబాబుదే బాధ్యత : లక్ష్మణ్

హైదరాబాద్, మే 11 ‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీడీపీ నాయకుల చర్యను ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... " అమిత్‌ షాపై దాడి ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి. ఆయన కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగింది. ఒక రోజు ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ దాడి జరిగింది. ఇదే విషయాన్ని ఆ ప్రాంత ఎస్పీ కూడా చెప్పారు. కానీ వాటిని పోలీసులు ఖాతరు చేయలేదు. ఈ విధమైన చర్యలు చేస్తే టీడీపీ చరిత్ర హీనమై పోతుంది" అని వ్యాఖ్యానించారు.

ఇదే ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎంకు తెలిసే ఈ దాడి జరిగిందని, ఇందుకు చంద్రబాబు బహిరంగంగా అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని వెంకటేశ్వర స్వామి భక్తులపై జరిపిన దాడిగా భావించాల్సి వస్తుందని అన్నారు. తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన తొలిసారి అని ఆయన అన్నారు. చంద్రబాబు అవకాశవాద వైఖరిని తెలుగు ప్రజలు గమనించాలని కోరారు.

Untitled Document
Advertisements