ఆ ఆలోచన నుండే 'రైతు బంధు' పుట్టింది : కేటీఆర్

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 04:11 PM

ఆ ఆలోచన నుండే 'రైతు బంధు' పుట్టింది : కేటీఆర్

మహబూబ్‌నగర్‌, మే 14 : రైతులను రుణ విముక్తులను చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే 'రైతుబంధు' పథకమని మంత్రి కే తారకరామారావు అన్నారు. గత ప్రభుత్వాలు రాబంధులుగా రైతులను పీక్కుతింటే.. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధువుగా ఈ పథకం చేపట్టిందన్నారు. భూత్పూర్‌ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సభలోరైతులకు మంత్రి చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..." కరెంటు కోసం ధర్నాలు చేసే పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించాం. ఎవరు ఎన్ని కేసులు వేసినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతాం. ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో కర్వెన రిజర్వాయర్ కోసం 5,700 ఎకరాల భూసేకరణకు సహకరించిన రైతులకు శిరస్సు వంచి పాదాబివందనం చేస్తున్నా" అని వ్యాఖ్యానించారు.

కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్ సహకారం లేకపోవడంతోనే ఏకకాలంలో పంట రుణమాఫీ చేయలేకపోయామని కేటీఆర్ తెలిపారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు రైతులకు నాలుగు రూపాయలైనా ఉచితంగా ఇచ్చారా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లినవారు సకాలంలో రాకపోయినా.. వారు ఎప్పుడొస్తే అప్పుడు చెక్కులు అందించాలని కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.





Untitled Document
Advertisements