కన్నడ పీఠం ఎవరికి దక్కేను..!

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 07:04 PM

కన్నడ పీఠం ఎవరికి దక్కేను..!

కర్ణాటక, మే 14 : గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న కర్నాటక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ నెల 12న ఆ రాష్ట్ర విధాన సభకు జరిగిన ఎన్నికల తుది ఫలితాలు రేపు రానున్నాయి. ఓ వైపు సర్వేలు ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాదని సంకీర్ణ ప్రభుత్వం తప్పదని చెబుతున్నాయి. మరో వైపు తొలుత ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపుపై ఎవరి ధీమా వారే ప్రదర్శించినప్పటికీ.. పోలింగ్‌ సరళిలో మార్పుతో ఆయా పార్టీల్లో ఫలితంపై స్పష్టత రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది.

రాష్ట్రంలో పునరాధికరం సాధించాలని కాంగ్రెస్, దక్షణాదిలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తుంది. మరో వైపు హంగ్ ఏర్పడే అవకాశాలు ఉంటే జేడీఎస్ పార్టీ 'కింగ్ మేకర్' కానుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా.. హంగ్‌ వస్తే మాత్రం ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు సమాలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దేశంలో 21 రాష్ట్రాలను పాలిస్తున్న కాషాయ దళం దక్షణాదిన కర్ణాటకలో పాగావేయాలని చూస్తుంది. అంతే కాకుండా ఈ ఫలితాలు రాబోవు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. మోదీ, అమిత్ షా ల మానియా దేశంలో ఏ మాత్రం తగ్గలేదని ప్రజలు అనుకోవాలంటే ఇక్కడ బీజేపీకి గెలుపు అనివార్యం.

కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ మళ్లీ గెలిచి సీఎం పీఠం అధిరోహించాలని హస్తం పార్టీ యోచిస్తోంది. ఇక్కడ గెలిస్తే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా తనదైన శైలిలో ముందుకు సాగవచ్చు. లేదంటే అతని నాయకత్వ ప్రతిభా మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అక్కడ ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య 'వన్ మ్యాన్ ఆర్మీ' గా రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు. లింగాయుత్ లను మైనార్టీల గుర్తించాలని ఆయన చేసిన ప్రయత్నం ప్రజల్లో ఎటుంటి భావనను కలిగించిందో చెప్పాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

ఈ రెండు పార్టీలతో పాటు జేడీఎస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కూడా సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితే వస్తే అతను ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్నది అందరిని ఉత్కంఠకు గురిచేస్తుంది. చివరకుఎవరు కన్నడ పీఠం పై కుర్చుంటారో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఈ నెల 12న 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ ఏ పార్టీ అయిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 స్థానాలను సాధించాలి.





Untitled Document
Advertisements