"రైతుబంధు" వద్దని డిమాండ్ చేయగలరా..!!!

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 12:15 PM


* ప్రతి పక్షాలపై సవాల్ విసిరిన కేటీఆర్‌
* రైతుబంధు ను వద్దని బహిరంగంగా చెప్పగలరా..?
* కాంగ్రెస్ భాజాపా లపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన కేటీఆర్‌

హైదరాబాద్, మే 15 : దమ్ముంటే "రైతుబంధు" పథకాన్ని రద్దు చేయమని బహిరంగంగా డిమాండ్ చేయగలరా..? అంటూ ప్రతిపక్షాలకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సవాల్ విసిరారు. కాంగ్రెస్‌, భాజపాలు రైతుబంధు పథకాన్ని చూసి భయపడుతున్నాయని ఆరోపించారు. ఆ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో రైతులు.. తమ రాష్ట్రంలో ఎక్కడ ఈ రైతుబంధు పథకాన్ని అమలు చేయమని తిరగబడతారో అని భయపడుతున్నారంటూ కేటీఆర్‌ దుయ్యబట్టారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పురులో పెట్టుబడి సాయం చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి.. పెట్టుబడి సాయ౦ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. కొంతమంది ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారన్నారు. కాని ముఖ్యమంత్రి ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రకటించారన్నారు.

గత ప్రభుత్వ పాలకులు రైతులకు చుక్కలు చూపిస్తే కేసీఆర్ చెక్కులు అందిస్తున్నారంటూ పేర్కొన్నారు. బ్యాంకుల్లో లక్షలకు లక్షలు లోన్ లు తీసుకొని విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ లాంటి వారు ఆ డబ్బులను ఎగవేస్తే అడిగే వారు లేరు కాని.. రైతులకు 4వేలు అందిస్తే సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నార౦టూ దుయ్యబట్టారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళిన రైతులకు సైతం ఈనెల 17 తర్వాత చెక్కులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.





Untitled Document
Advertisements