కర్ణాటకలో 'హంగ్' మా..

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 11:45 AM

కర్ణాటకలో 'హంగ్' మా..

కర్ణాటక, మే 16 : కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం హై వోల్టాజ్ డ్రామా నడుస్తుంది. మే 15 న విడుదలైన కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. దీంతో రాష్ట్రంలో త్రిశంకు సభ సమరం మొదలైంది. అతి పెద్ద పార్టీనే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని అటు బీజేపీ అంటుండగా, మరోవైపు తమకు కావాల్సిన మద్దతు ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అంటోంది. దీనిపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఆయా పార్టీలు తమ ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అందరినీ సురక్షితమైన ప్రాంతానికి మార్చే యోచనలో ఉన్నామని, ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి పథకం ఏంటో తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

"అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపా(104)కు స్పష్టమైన మెజార్టీ లేదు. మాకు (కాంగ్రెస్‌, జేడీఎస్‌) 117 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి దాన్ని నాశనం చేస్తారా? గవర్నర్‌ గత సంబంధాలను పక్కన పెట్టాలి. అది భాజపా అయినా ఆరెస్సెస్ అయినా" అని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ విలేకరులతో వ్యాఖ్యానించారు.

ఓ వైపు అధిక స్థానాలు సాధించిన బీజేపీ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు ఎనిమిది స్థానాల దూరంలో నిలిచిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా తన ఆపరేషన్‌ తీవ్రతరం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామిని జేడీఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం బెంగళూరులోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు.

Untitled Document
Advertisements