రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని ఎదురుదెబ్బ..

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 02:12 PM

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని ఎదురుదెబ్బ..

జైపూర్‌, మే 16 : రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-11 టోర్నీలో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన తరుణంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు స్టోక్స్‌, బట్లర్‌ దూరం కానున్నారు. ప్రస్తుతం ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునేందుకు రాజస్థాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో వీరిద్దరూ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. పాకిస్థాన్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ తాజాగా జట్టును వెల్లడించింది. ఇందులో బట్లర్‌, స్టోక్స్‌ చోటు దక్కించుకున్నారు.

పాకిస్థాన్‌-ఇంగ్లాండ్ మధ్య మే 24న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఐపీఎల్‌ను వదిలి స్వదేశానికి వెళ్లనున్నారు. వెంటనే ఇంగ్లాండ్‌ వచ్చి జట్టు సభ్యులతో కలవాలని బోర్డు నుంచి స్టోక్స్‌, బట్లర్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడిన మ్యాచే ఈ సీజన్‌లో వారికి చివరి మ్యాచ్‌ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లతో, ఫ్రాంఛైజీ నిర్వాహకులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. సహచర ఆటగాళ్లతో దిగిన కొన్ని ఫొటోలను ఈ సందర్భంగా స్టోక్స్‌ పంచుకున్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన స్టోక్స్‌ టోర్నీలో 13 మ్యాచ్‌లు ఆడాడు. 196 పరుగులు మాత్రమే చేసిన ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టోక్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డు దక్కించుకొన్నాడు. మరో ఆటగాడు బట్లర్‌ మాత్రం అదరగొట్టాడు ఈ సీజన్ లో రాజస్థాన్ తరుపున 13 మ్యాచ్‌ల్లో ఆడి 548 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

Untitled Document
Advertisements