'జనసేన' జేడీఎస్ లా మారుతుందా...!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 09:35 PM

'జనసేన' జేడీఎస్ లా మారుతుందా...!

అమరావతి, మే 16 : ప్రస్తుతం యావత్ దేశం మొత్తం కర్ణాటక వైపు ఆసక్తిగా చూస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రజలు రాజకీయ పార్టీలను త్రిశంకు సమరంలో పడేశారు. ఏ పార్టీకి మెజారిటీ దక్కనివ్వకుండా చేసి అధికారాన్ని రసవత్తరంగా మార్చేశారు. మే 15 న విడుదలైన కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించడంతో కన్నడ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.

కన్నడ నాట జరుగుతోన్న పరిణామాలను పక్కనబెడితే.. ఏపీలో జనసేన కూడా జేడీఎస్‌లా మారితే..? అనే ఆలోచన ఆసక్తి కలిగిస్తోంది. నిజానికి కర్ణాటకలో జేడీఎస్ ప్రాబల్యం దక్షిణాదికి మాత్రమే పరిమితం. అంతే కాకుండా ఆ పార్టీ కుటుంబ పార్టీ అనే ముద్రను కూడా చేరిపెసుకోలేకపోయింది. పాత మైసూర్ ప్రాంతంలోనే ఆ పార్టీకు బలం అధికంగా ఉంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు 38 స్థానాలు రాగా... అందులో పాత మైసూర్‌ ప్రాంతంలో వచ్చిన సీట్లే 25 కావడం విశేషం. దాని బలమంతా ఆ ప్రాంతంలోని ఒక్కలిగ సామాజిక వర్గమే.

ఇదే తరహాలో జనసేన కూడా కాపులు అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ హవా కొనసాగిస్తే.. కింగ్ మేకర్‌గా మారే అవకాశాలున్నాయి. అంతే కాకుండా పవన్ కు కూడా ప్రజల మద్దతు లభించే అవకాశం కొట్టిపారేయలేనిది. ముఖ్యంగా జనసేన ఓటు బ్యాంక్ ప్రధానంగా కాపులు, యువతే. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అలా చూస్తే జనసేనాని ఎఫెక్ట్ రాష్ట్రంలో ఉందని తెలుస్తోంది. కానీ మిగతా పార్టీలు కూడా గణనీయంగా ఉన్న కాపు ఓటు బ్యాంకుపై కన్నేశాయి. ఓవైపు అధికార టీడీపీ కూడా కాపులకు తగిన ప్రాధాన్యం ఇస్తోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కాపు నాయకుడైన కన్నాకు అప్పగించింది. జగన్ పార్టీ వైసీపీ కూడా కాపుల సంక్షేమం కోసం పోరాటం చేస్తుంది.

ఈ మూడు పార్టీలను కాదని.. కాపులు తనకే ఓటేసేలా పవన్ కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఒక వేళా జనసేన తన హవాను పెంచుకోగాలిగితే రాష్ట్రంలో ఆ పార్టీ బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే అక్కడ ఉన్న మిగతా పార్టీలకు జనసేన గట్టి పోటీనిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Untitled Document
Advertisements