యడ్యూరప్ప.. ముచ్చటగా మూడో సారి..

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 10:34 AM

 యడ్యూరప్ప.. ముచ్చటగా మూడో సారి..

బెంగళూరు, మే 17 : అనేక ఉత్కంఠ పరిణామాల మధ్య కర్ణాటక రాష్ట్ర పగ్గాలు బీజేపీ దక్కించుకుంది. మే 15న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజార్టీకి దగ్గరగా వచ్చి ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక 23వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి కావడం విశేషం.

కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. సీఎంగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామిని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్‌ సంసిద్ధత ప్రకటించిన నేపథ్యంలో కన్నడ రాజకీయం రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా యడ్యూరప్ప, కుమారస్వామి ఇద్దరూ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరగా.. తాజాగా గవర్నర్‌ 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో బల నిరూపణకు 15రోజుల గడువు ఇచ్చారు. దీంతో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ఈరోజు ఉదయం 9 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

మండిపడ్డ కాంగ్రెస్‌..
గవర్నర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు పూర్తి మెజార్టీ ఉందని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుమారస్వామిని గవర్నర్‌ ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. యడ్యూరప్పను ఆహ్వానించినట్టు తమకు తెలిసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని చిదంబరం అన్నారు.

Untitled Document
Advertisements