ముంబై కథ ఖేల్ ఖతం..

     Written by : smtv Desk | Sun, May 20, 2018, 09:44 PM

ముంబై కథ ఖేల్ ఖతం..

ఢిల్లీ, మే 20 : ఐపీఎల్-11 సీజన్ లో డిపెండింగ్ ఛాంపియన్ కథ లీగ్ దశలోనే ముగిసింది. టోర్నీలో భాగంగా ఈ రోజు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుండి వైదొలిగింది. ఈ సీజన్ లో మొదటి సారిగా ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించిన ఢిల్లీ జట్టు ముంబైని ముంచేసింది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు బ్యాట్స్‌మెన్‌ వరుసగా చేతులెత్తేశారు.

తొలుత టాస్ నెగ్గిన ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టులో రిషబ్‌ పంత్‌ (64), విజయ్‌ శంకర్‌ (43) అద్భుతంగా పోరాడటంతో ఢిల్లీ నిర్ణీత 20ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు కట్టడి చేసిన చివర్లో విజయ్‌ శంకర్‌ పోరాడటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి జట్టులో ఎవిన్‌ లూయిస్‌(48) దూకుడుగా బ్యాటింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అతనికి అవతలి ఎండ్‌ నుంచి సరైన సహకారం లభించలేదు. ఇషాన్‌ కిషన్‌(5), పొలార్డ్‌(7), రోహిత్‌ శర్మ(13), కృనాల్‌ పాండ్యా(4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ముంబై 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

తర్వాత హార్దిక్‌ పాండ్యా (27) కాసేపు మెరుపులు మెరిపించి ఏడో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక ఆఖరిలో బెన్‌ కట్టింగ్‌ (37‌) పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. దీంతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్లలో లామ్‌చెన్‌, అమిత్‌ మిశ్రా, హర్షల్‌ పటేల్‌లు తలో మూడేసి వికెట్లతో సత్తాచాటగా, ట్రెంట్‌ బౌల్ట్‌కు ఒక వికెట్‌ దక్కింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డ్ అమిత్ మిశ్రాకు దక్కింది.Untitled Document
Advertisements