బై.. బై.. 'పంజాబ్'

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 12:03 PM

బై.. బై.. 'పంజాబ్'

పుణె, మే 21 : ఐపీఎల్ లో లీగ్ దశ ఉత్కంఠకు తెరపడింది. ప్లే ఆఫ్ కు చేరాలన్న కింగ్స్ x1 పంజాబ్ జట్టు ఆశలు నెరవేరలేదు. పుణె వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగింది. ఫలితంగా ఏడు విజయాలతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు ప్లేఆఫ్‌కు చేరిన జట్లు కాగా, చివరిగా రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది.

తొలుత టాస్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టులో కరుణ్ నాయర్ (54) అర్ధశతకంతో రాణించగా, మనోజ్ తివారి (35) పర్వాలేదనిపించాడు. చెన్నై జట్టులో దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడి (10/4) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా అతనికి సహకారం అందించడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ధోని సేన 19.1 ఓవర్లలో 159 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై జట్టులో రైనా(61 నాటౌట్) దీపక్ చాహార్ (39), రాణించారు. లక్ష్యం చిన్నదే అయినా ఆరంభంలో చెన్నై తడబడింది. కానీ ఆఖర్లో రైనా వేగంగా ఆడటంతో గెలుపు సులువైంది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు కావాల్సి ఉండగా 19వ ఓవర్‌లో రైనా 6,2,6,4,4తో ఏకంగా 22 పరుగులు రాబట్టగా.. ధోనీ (16 నాటౌట్‌) సిక్సర్‌తో మరో ఐదు బంతులుండగానే చెన్నై గెలుపొందింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లుంగి ఎంగిడి దక్కింది.





Untitled Document
Advertisements