'కాలా' లో శివాజీ రావు గైక్వాడ్..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 03:40 PM

'కాలా' లో శివాజీ రావు గైక్వాడ్..

చెన్నై, మే 21 : సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాలా'. వండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై హీరో ధనుష్‌ సినిమాను నిర్మించారు. సంతోష్‌ నారాయణన్‌ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీలో పోలీసు పాత్రలో తమిళ నటుడు అరవింద్‌ ఆకాశ్‌ నటించారు. ఆయన ఇప్పటికే పలు విజయవంతమైన తమిళ చిత్రాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన 'కాలా'లో రజనీ అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’అనే‌ పోలీసు అధికారి పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.." 'కాలా' సినిమా విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. రజనీ సినిమాలో ఏ నటుడికీ లభించని అరుదైన అవకాశం నాకు దక్కింది. ఇందులో రజనీకాంత్‌ అసలైన పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ అనే‌ పోలీసు అధికారి పాత్రలో నేను కనిపించాబోతున్నాను. తలైవా సినిమాలో ఆయన పేరుతో ఉన్న పాత్రను పోషించే అవకాశం ఇప్పటి వరకూ ఎవరికీ రాలేదు. రజనీకాంత్‌తో కలిసి సినిమాలో నటించడం.. ఆయన అసలు పేరుతో ఉన్న పాత్రను పోషించడం నా సినీ కెరీర్‌లో ఓ చరిత్రగా నిలుస్తుంది. ఇప్పటి వరకు రజనీ సినిమాలో ఇలా జరగలేదు. ఇంత గొప్ప అవకాశం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ ఇలాంటి అవకాశం మరో నటుడికి వస్తుందో? రాదో?. నేనే మొదటి నటుడ్ని అయినందుకు ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.

ఈ సినిమాలో రజనీకాంత్‌ ముంబయిలోని మురికివాడలో నివసిస్తున్న తమిళ వాసుల కోసం పోరాడే నాయకుడిగా అలరించనున్నారు. ఆయన భార్యగా ఈశ్వరీరావు కనిపించనున్నారు. హుమా ఖురేషీ, నానా పటేకర్‌, సముద్రఖని, అంజలి పాటిల్‌, సుకన్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Untitled Document
Advertisements