టీమిండియా మాజీ కెప్టెన్ పై 'బయోపిక్'..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 04:30 PM

టీమిండియా మాజీ కెప్టెన్ పై 'బయోపిక్'..

ముంబై, మే 21 : సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినిమా రంగం జనాలను త్వరగా అర్ధమయ్యే మార్గం కనుక కొందరు దర్శకులు ప్రముఖులు జీవిత కథ ఆధారంగా చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్టు బయోపిక్ లు కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. ఇటీవల అలనాటి సావిత్రి జీవితాధారంగా వచ్చిన ‘మహానటి’ బయోపిక్‌ విడుదలైంది. నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్‌ సిద్ధమవుతోంది. అటు క్రీడా ప్రముఖుల్లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌, మాజీ టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్‌ ధోనీ, మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ బయోపిక్‌లు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

ఇప్పుడు మరో మాజీ కెప్టెన్‌ బయోపిక్‌ అలరించనుంది. ఆయనే టీమిండియా క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ. ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీ ఫిలింస్ యజమాని, ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్‌ ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం దాదా జీవితాధారంగా ‘ఎ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’ అనే ఆటోబయోగ్రఫీ విడుదలైంది. ఇదే పుస్తకం ఆధారంగా సినిమా తీయాలని ఏక్తా యోచనలో ఉన్నారట.

దీని గురించి చర్చించేందుకు ఏక్తా.. సౌరవ్‌ను కలిసినట్లు సమాచారం. అయితే తన బయోపిక్‌ను కోల్‌కతాకు చెందిన దర్శకుడు తెరకెక్కించాలని సౌరవ్ అనుకుంటున్నారట. కానీ ఏక్తా మాత్రం ముంబయికి చెందిన దర్శకుడినే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే దీనిని డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తారా? లేక బయోపిక్‌గా తీస్తారా? వేచి చూడాలి.

Untitled Document
Advertisements