భారత్ పై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 01:58 PM

భారత్ పై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఇస్లామాబాద్‌, మే 23: భారత్ పై ఏదో రకంగా దాయాది పాకిస్థాన్ తన అక్కసును వెల్లగక్కుతూ ఉంటుంది. తాజాగా పాక్ మంత్రి అసన్‌ ఇక్బాల్‌ భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 90వ దశకంలో భారత్‌ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడడానికి కారణం పాకిస్తాన్‌ ఆర్థికవేత్త, మాజీ మంత్రి సత్రాజ్‌ అజీజ్‌ వ్యూహాలని అమలుచేయడమేనని ఆయన అన్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌ వంటి పక్క దేశాలు తమ వ్యూహాల్ని అమలు చేయడం ద్వారా ప్రస్తుతం తమ కంటే ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉన్నాయంటూ అసన్‌ తన అసూయను బయటపెట్టారు.

90వ దశకంలో భారత్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని.. ఆ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ సత్రాజ్‌ అజీజ్‌ సలహా కోరారని అన్నారు. సత్రాజ్‌ అజీజ్‌ వ్యూహాల్ని చక్కగా అమలు చేసిన మన్మోహన్‌.. భారత్‌లో పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీని ప్రారంభించిన అసన్‌ ఇక్బాల్‌.. పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి దేశంలో తలెత్తిన రాజకీయ అస్థిరతే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో 2జీ వైర్‌లెస్‌ టెక్నాలజీని ఉపయోగించిన పాక్‌ ప్రస్తుతం 5జీ టెక్నాలజీని వినియోగిస్తున్న దేశాల్లో ముందుందని సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధట్యాంకులు, క్షిపణులు మాత్రమే దేశాన్ని రక్షించలేవని, ఆర్థికంగా శక్తి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements