లష్కరే 'ఫోన్'౦ట.. నిఘా వర్గాలకు చిక్కదంట..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 03:11 PM

లష్కరే 'ఫోన్'౦ట.. నిఘా వర్గాలకు చిక్కదంట..

ఢిల్లీ, మే 23 : ప్రపంచ అభివృద్ధికి ఆటంకంగా మారిన ఉగ్రవాదం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది. విస్తరిస్తున్న సాంకేతికతను ఉపయోగించుకొని తమ ఉనికిని దశదిశలు వ్యాప్తి చేసుకొనేలా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం. నిఘా వర్గాలకు తెలియకుండా ఓ కొత్త రకమైన మొబైల్‌ ఫోన్‌ను ఆ సంస్థ తయారుచేసుకుందని తెలుస్తోంది. సిమ్‌తో సంబంధంలేని ఈ ఫోన్‌ సిగ్నళ్ళు నిఘా వర్గాలకు కూడా చిక్కవట. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న లష్కరే ఉగ్రవాది జాయ్‌బుల్లా విచారణ సమయంలో వెల్లడించాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కుప్వారాలో జరిపిన ఓ ఆపరేషన్‌లో జాయ్‌బుల్లా అలియాస్‌ హంజాను భద్రతా సిబ్బంది ప్రాణాలతో బందీగా పట్టుకున్నారు. తర్వాత విచారణ నిమిత్తం ఎన్ఐఏకు అప్పగించారు. విచారణలో జాయ్‌బుల్లా లష్కర్‌ ఉగ్రవాద సంస్థ గురించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. 2017లో లష్కరే తోయిబా 15-25 వయసు గల 450 మంది యువకులను నియమించుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు అతను తెలిపాడు.

"లష్కరే తోయిబాకు చెందిన విద్యార్థి విభాగం అల్‌ మహ్మదీయ స్టూడెంట్స్‌(ఏఎంఎస్‌) ఓ ప్రత్యేక మొబైల్‌ ఫోన్‌ను తయారుచేసింది. లష్కర్‌ ఉగ్రవాదుల సంభాషణ కోసం దీన్ని రూపొందించారు. ఇందులో ఒక చిప్‌ లాంటిది వేయగానే ఆ మొబైల్‌ దగ్గర లోని మొబైల్‌ టవర్‌కు అనుసంధానం అవుతుంది. ఈ ఫోన్ల ద్వారా చేసే కాల్స్‌ను నిఘా వర్గాలు కనిపెట్టలేవు. ఒకవేళ ట్రేస్‌ చేయడానికి యత్నిస్తే ఆ కాల్స్‌ ఆటోమెటిక్‌గా ఆగిపోతాయి" అని జాయ్‌బుల్లా వ్యాఖ్యానించాడు.





Untitled Document
Advertisements