అ వదంతులు నమ్మొద్దు : డీజీపీ

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 06:32 PM

అ వదంతులు నమ్మొద్దు : డీజీపీ

హైదరాబాద్, మే 23 ‌: రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. . ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు తిరుగుతున్నారంటూ వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తల్ని ప్రజలు సోషల్‌మీడియాలో ఫార్వార్డ్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌, అలాగే రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని జియాపల్లి లాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. గ్రామస్థులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదన్నారు.

వ్యక్తులుగా ఎవరినైనా సంప్రదించినప్పుడు వారు సరైన సమాధానం చెప్పకపోతే అనుమానించి చిత్రహింసలకు గురిచేయడం సరికాదన్నారు. ముఠాల సంచారంపై సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అబద్ధమేనన్నారు. రాష్ట్రంలో ఎలాంటి గ్యాంగుల సంచారం లేదని డీజీపీ స్పష్టంచేశారు. ఎవరైనా దొంగలు వస్తే వారిని పట్టుకొనే శక్తి సామర్థ్యాలను తెలంగాణ పోలీసులకు ఉన్నాయన్నారు. ఎక్కడికక్కడ సీసీటీవీలు అందుబాటులో ఉన్నాయని, సరైన నిఘా వ్యవస్థ ఉందన్నారు. కమ్యూనిటీ పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. తెలంగాణాలో ఎక్కడ నేరం జరిగినా, నేరస్థులు ఎక్కడ సంచరిస్తున్నా ప్రజల సహకారంతో తెలుసుకొనే సామర్థ్యం పోలీసులకు ఉంది గనక ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు.





Untitled Document
Advertisements