హ్యాట్రిక్‌పై గురి పెట్టిన విజయ్- మురుగదాస్..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 05:03 PM

హ్యాట్రిక్‌పై గురి పెట్టిన విజయ్- మురుగదాస్..

చెన్నై, మే 24 : తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకొన్న నటుడు విజయ్. ఆయన హీరోగా, ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'తుపాకీ', 'కత్తి' సినిమాలు బ్లాక్‌బస్టర్‌ గా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకునేందుకు జతకట్టారు. కాగా ఇది విజయ్‌కి 62వ చిత్రం. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్‌ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 'తలైవా' విడుదల తరుణంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టు ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేదు.

విజయ్ ఇప్పుడు రాజకీయ అంశాలు నిండిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . 'మెర్సల్‌' (అదిరింది) వంటి మెగాహిట్‌ తర్వాత వస్తున్న సినిమా ఇది. ప్రముఖ రాజకీయ నేత పళ.కరుపయ్య ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నగర శివారులో చిత్రీకరణ జరుగుతోంది. దీని కోసం పెద్దఎత్తున రాజకీయ బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. రాధారవి, పళ.కరుప్పయ్య ఫొటోలతో రూపొందించిన బ్యానర్ల చిత్రాలు కూడా విడుదలయ్యాయి.

ఓ రాజకీయ వేదికపై విజయ్‌ కోట్‌, సూట్‌తో కూర్చుని ఉన్నట్లు కూడా ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. ‘మెర్సల్‌’లో విజయ్‌ చెప్పిన జీఎస్టీ, డిజిటల్‌ ఇండియా డైలాగులు పెద్దస్థాయిలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఆ స్థాయిలో డైలాగులను ఆశిస్తున్నారు అభిమానులు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చెప్పాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు..!





Untitled Document
Advertisements