'అమ్మమ్మ‌గారిల్లు' రివ్యూ..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 03:59 PM

'అమ్మమ్మ‌గారిల్లు' రివ్యూ..

టైటిల్ : అమ్మమ్మ‌గారిల్లు
తారాగణం : నాగ‌శౌర్య‌, షామిలి, సుమిత్ర‌, రావు ర‌మేష్‌, శివాజీరాజా, హేమ‌, సుధ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, ర‌విప్ర‌కాష్ త‌దిత‌రులు
సంగీతం : క‌ళ్యాణ ర‌మ‌ణ
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్ సూర్య‌
నిర్మాత : రాజేష్‌
విడుదల తేది : 25-05-2018

తెలుగు చిత్రపరిశ్రమలో పల్లెటూరు నేపథ్యంలో వస్తున్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామీణ అనుబంధాల నేపథ్యంలో వచ్చే చిత్రాలు టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేశాయి. గతేడాది సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'శతమానం భవతి' ఎంత హిట్ అయ్యిందో వేరే చెప్పకర్లేదు. తాజాగా యంగ్ హీరో నాగ‌శౌర్య‌ అదే తరహ కథాంశంతో 'అమ్మమ్మ‌గారిల్లు' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ఛలో' వంటి మంచి హిట్ సినిమా తర్వాత వచ్చిన నాగ‌శౌర్య‌ కు మరో విజయం దక్కిందా..? కుటుంబ క‌థ‌లో అతను ఎలా ఒదిగిపోయాడు? చూద్దాం.

కథ : సీతామహాలక్ష్మి(సుమిత్ర)ది పెద్ద కుటుంబం. ఆస్తి పంపకాలపై గొడవలు రావడంతో తట్టుకోలేక కుటుంబ పెద్ద సూర్యనారాయణ(చలపతిరావు) కలత చెంది మరణిస్తాడు. దాంతో కుటుంబం విడిపోతుంది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు తలో దిక్కు వెళ్లిపోతారు. 20 ఏళ్లయినా తిరిగిరారు. కానీ, చిన్నప్పుడే అమ్మమ్మతో అనుబంధం ఏర్పరుచుకున్న సంతోష్‌(నాగశౌర్య) అందర్నీ కలపాలని అనుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు..? అమ్మమ్మ ముఖంలో సంతోషం ఎలా నింపాడు..? అందరిని ఎలా దగ్గర చేసాడు..? అన్నదే కథ

విశ్లేషణ : పల్లెటూరి నేపథ్యం.. అందరికి తెలిసిన కథే అయిన తెరకెక్కించే విధానంలో తేడా వస్తే ఫలితం తారుమారు అయిపోతుంది. కానీ ఆ విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు అనే చెప్పాలి. ఎన్ని సినిమాలు వచ్చినా కుటుంబ కథలు మళ్లీ మళ్లీ తెరకెక్కడం.. వాటిని ప్రేక్షకులు ఆదరించడం వెనుక కారణం బంధాలు-అనుబంధాల మహిమే. అక్కడడక్కడా హాస్యంతో నవ్విస్తూ.. సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. ఆరంభ సన్నివేశాలు హత్తుకుంటాయి. ప్రేక్షకుడిని త్వరగా కథలో లీనం చేస్తాయి.

ముఖ్యంగా రావురమేశ్‌, నాగశౌర్య పాత్రలను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. మధ్యలో కథలో కాస్తా వేగం తగ్గినట్టుగా ఉంటుంది. ఇక సంతోష్‌, సీత(షామిలి)పాత్రల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్లో బలం లేకపోవడం, కథలో పెద్ద మలుపులు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. భావోద్వేగాలు, వినోదం, కుటుంబ బంధం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు. టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కళ్యాణ రమణ అందించిన పాటలు, సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వలేదనిపిస్తాయి.

ఈ సినిమాతో నాగశౌర్య నటనలో పరిణితి కనబరిచాడు. సీతమ్మ మనవడు సంతోష్ పాత్రలో అతను సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా ఇంటి పెద్దకొడుకుగా ఏ2 కాంట్రాక్టర్‌ బాబూరావుగా ఆయన నటన హావభావాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఒకప్పుడు బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శాలిని.... ఆ మధ్య ‘ఓయ్' సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. అయితే లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోలేక పోయింది. ‘అమ్మమ్మగారిల్లు' సినిమాలో కూడా శాలిని మరోసారి నిరాశ పరిచిందనే చెప్పాలి.

శివాజీ రాజా, సుమిత్ర, రవి ప్రకాశ్‌, హేమ, సుధ తదితరుల పాత్రలు ఓకే అనిపిస్తాయి. స్నేహితుడి పాత్రలో షకలక శంకర్‌ ఒదిగిపోయాడు. పోసాని, గౌతం రాజు, సమ్మెట గాంధీ తదితరులు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు పాత కథనే కొత్తగా తీర్చిదిద్దిన విధానం మెచ్చుకునేలా ఉంది.

బలాలు:
+ నాగశౌర్య నటన
+హాస్యం
+ కుటుంబ నేపథ్యం

బలహీనతలు:
- రొటీన్ స్టొరీ
- అక్కడక్కడ కథ వేగం తగ్గడం

రేటింగ్ : 2.75 /5

గమనిక : ఈ చిత్ర సమీక్ష సినిమా చూసిన ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం. పాఠకులు గమనించగలరు.





Untitled Document
Advertisements