బల పరీక్షలో నెగ్గిన కుమారస్వామి..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 04:30 PM

బల పరీక్షలో నెగ్గిన కుమారస్వామి..

బెంగళూరు, మే 25 : అందరు ఊహించిందే జరిగింది. కర్ణాటక కొత్త సీఎం కుమారస్వామి బలపరీక్ష విజయం లాంఛనప్రాయమే అయ్యింది. శాసనసభలో శుక్రవారం నిర్వహించిన బలపరీక్షలో ఆయన సులభంగా నెగ్గారు. విశ్వాస పరీక్షకు ముందే బీజేపే విధాన సభ నుంచి వాకౌట్‌ చేయడంతో మూజు వాణి ఓటుతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం నెగ్గినట్లు స్పీకర్‌ వెల్లడించారు. కుమారస్వామికి 117 మంది సభ్యుల మద్దతు లభించింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న జరిగాయి. ఈ నెల 15న వెలువడిన ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 స్థానాలు దక్కించుకొన్నారు.

ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు భాజపా, కాంగ్రెస్‌లు పోటీపడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా తొలుత భాజపాను ఆహ్వానించడంతో ఆ పార్టీ సీనియర్‌ నేత యడ్యూరప్ప ఈ నెల 17న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే విధానసభలో బలం నిరూపించుకోలేక యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ ప్రభుత్వం మూడు రోజులకే పడిపోయింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ముందుకొచ్చింది. ఇందుకు గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపారు. అలా గత బుధవారం జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నేడు బలపరీక్ష నిర్వహించగా.. కుమారస్వామి గెలుపొందారు.

Untitled Document
Advertisements