దీక్షకు సిద్ధమైన జనసేనాని..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 06:45 PM

దీక్షకు సిద్ధమైన జనసేనాని..

శ్రీకాకుళం, మే 25 : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తాను బస చేస్తోన్న రిసార్ట్‌లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లోగా స్పందిచకపోతే దీక్షకు దిగుతానని హెచ్చరించిన ఆయన ప్రకటించినట్లే దీక్షకు సిద్ధమయ్యారు. ఈమేరకు రేపు శ్రీకాకుళం పట్టణంలో ఆయన నిరాహార దీక్ష చేయనున్నారు.

శుక్రవారం సాయంత్రం 5 నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకూ పవన్‌ ఎలాంటి ఆహారం తీసుకోరని పార్టీ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల సమక్షంలో దీక్షలో ఉంటారని అన్నారు. పవన్‌ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన శ్రేణులు సంఘీభావ దీక్ష చేస్తాయన్నారు.

"శ్రీకాకుళంలో సమస్య ఉంటే విశాఖపట్నంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని సర్కార్ చెప్పడం ఏమిటి? ఏమైనా మా సొంతానికి, మా ఇంట్లో పెట్టమని అడుగుతున్నామా? మంచి చేస్తే ఆ పేరేదో తనకే వస్తుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి లేదా? పవన్ కల్యాణ్ దీక్ష చేస్తే తాను ఎందుకు చేయాలా? అని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది. మా అధ్యక్షుడు చేపట్టిన పోరాట యాత్రకి ప్రజల్లో వస్తోన్న స్పందన చాలా బాగుంది. జనసేన అధ్యక్షుడు తమ బాధలు తీరుస్తారనే ఆశ ప్రజల్లో కనిపిస్తోంది. ఇది ఇతర పార్టీలకి కంటగింపుగా వుంది. అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు" అని మాదాసు గంగాధరం వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements