పైపైకి పెట్రోల్ ధరలు..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 08:29 PM

పైపైకి పెట్రోల్ ధరలు..

ముంబై, మే 25 : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వినియోగదారులను బెంబేలేత్తుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈ రోజు కూడా పైపైకి ఎగిశాయి. లీటర్ పెట్రోల్ 32 పైసలు, డీజిల్ 18 పైసలు చొప్పున పెరిగింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు ధరలు పెంచకుండా స్తబ్దుగా ఉన్న చమురు సంస్థలు ఆ తర్వాత విజృంభిస్తూ వస్తున్నాయి. కేంద్రం చేష్టలుడిగి చూస్తోందంటూ విమర్శలు వస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని వినియోగదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటికి వరకూ పెట్రోల్ ధరలు రూ.11 రూపాయల మేరకు పెరిగాయి. డీజిల్ ధర రూ.7.27కు పెరిగింది. శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.77.83కు చేరుకోగా, ముంబైలో రూ.73.20కు, చెన్నైలో రూ.81కి చేరింది. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంతకుముందు చెప్పినప్పటకీ ఇంకా వినియోగదారుడికి ఎలాంటి ఊరట దొరకలేదు.

మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు భారీ నిరసనను చేపట్టాయి. పెట్రో ధరలు దిగివచ్చేలా చర్యలు చేపడతామని కేంద్రం సంకేతాలు పంపినప్పటికీ, భారీగా ఆందోళనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయంగా ఈ ధరలు పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్లోబల్‌గా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రష్యా నుంచి సరఫరా పెరగనుందనే సంకేతాలతో ఈ ధరలు తగ్గాయి. ఈ ప్రభావంతో దేశీయంగా ఏమైనా ధరలు తగ్గే అవకాశముందో లేదో వేచి చూడాలి.

Untitled Document
Advertisements