రఫ్ఫాడించిన రషీద్ ఖాన్..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 11:29 AM

రఫ్ఫాడించిన రషీద్ ఖాన్..

కోల్‌కతా, మే 26 : సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లింది. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తో జరిగిన క్వాలిఫైయర్-2 హైదరాబాద్ జట్టు 14 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో రైజర్స్ జట్టు మే 27న ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ ‌(3/19) ఇటు బంతితోనూ, అటు బ్యాట్‌ తోనూ(34నాటౌట్‌; 10బంతుల్లో 2×4, 4×6), ఫీల్డింగ్ లో అదరగొట్టే ప్రదర్శన చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే సన్ రైజర్స్ జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

తొలుత టాస్ నెగ్గిన కేకేఆర్ సారథి కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్‌ ఆటగాళ్లలో ధావన్‌‌(34), వృద్ధిమాన్‌ సాహా(35), షకిబుల్‌ హసన్‌(28)లు ఫర్వాలేదనిపించారు. ఒకదశలో ఆ జట్టు స్కోర్ 150 దాటుతుందో లేదో అనిపించింది. చివర్లో రషీద్‌ ఖాన్‌(34 నాటౌట్‌;10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన 175పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు. క్రిస్‌ లిన్‌ (48), సునీల్‌ నరైన్‌ (26)ల జోరుతో అలవోకగా గెలిచేలా కనిపించింది. వీరిద్దరూ ఔటైన తర్వాత నితీష్‌ రాణా(22), శుభ్‌మాన్‌ గిల్‌(30) మినహా ఎవరూ ఆడలేదు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్ కు దక్కింది.





Untitled Document
Advertisements