'సైకిల్' నుండి 'కారు' లోకి...

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 12:43 PM

'సైకిల్' నుండి 'కారు' లోకి...

జగిత్యాల, మే 26 : జగిత్యాల జిల్లాలో టీటీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ముఖ్య అనుచరుడు, జగిత్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా పని చేసిన బోగ వెంకటేశ్వర్లు పార్టీని వీడారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, నిజామాబాద్‌ ఎంపీ కవిత సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకున్నారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. 15 రోజుల క్రితం కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న సాంబారి ప్రభాకర్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోగా... తాజాగా జగిత్యాల ఇన్‌ఛార్జి కారు పంచాన చేరుకోవడంతో జగిత్యాలలో టీడీపీకు పెద్ద షాక్ తగిలినట్లయింది.

గురువారం పార్టీకి రాజీనామా చేసిన బోగ వెంకటేశ్వర్లు ఆయన అనుచరులతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. గంటపాటు ఎంపీ కవితతో సమావేశమైన వెంకటేశ్వర్లు బృందం ఆ వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ గాడిన పడుతుందనుకున్న సమయంలో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నెల 7న కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి సాంబారి ప్రభాకర్‌, జిల్లా అధికార ప్రతినిధి ధనుంజయ్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ తోట నారాయణలు టీడీపీకి రాజీనామా చేసి, కవిత సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వెంకటేశ్వర్లుతో పాటు వడ్డెర సంఘం నేత మొగిలి, పద్మశాలి సంఘం నేతలు బూస గంగారాం, మానపూర్‌ శ్రీహరి, పూసల సంఘం నేతలు సురేందర్, చకిలం కిషన్, బోగ ప్రవీణ్‌ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

Untitled Document
Advertisements