సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 06:51 PM

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..

సిద్దిపేట, మే 26 : జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సును రెండు లారీలు, క్వాలీస్‌ ఢీకొట్టాయి. ఈ ఘటనలలో 10మంది దుర్మరణం పాలవ్వగా.. 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గాయపడినవారిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గాయపడ్డవారిని గజ్వేల్‌, హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

రాజీవ్‌ రహదారిపై రాజధాని బస్సు అదుపుతప్పి ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొని బోల్తాపడింది. దీంతో ఆ లారీ ఎదురుగా ప్రయాణిస్తున్న క్వాలీస్‌ను, మరో లారీని బలంగా ఢీకొంది. ఈఘటనలో రెండు లారీల మధ్య క్వాలీస్‌ వాహనం నలిగిపోయింది. మృతులను వెంటనే గుర్తించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మెరుగైన వైద్యం కోసం సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు తరలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. మృతులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఒక యువ జర్నలిస్టు కూడా ఉన్నట్టు సమాచారం. పోలీసులు, వైద్యసిబ్బంది, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఘటనపై మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements