టెలికాం రంగంలోకి 'పతంజలి' సంస్థ..

     Written by : smtv Desk | Mon, May 28, 2018, 04:52 PM

టెలికాం రంగంలోకి 'పతంజలి' సంస్థ..

హరిద్వార్, మే 28 : విదేశీ ఉత్పత్తులకు ధీటుగా మార్కెట్ లోకి ప్రవేశించిన 'పతంజలి' కంపెనీ మంచి పేరుతో పాటు, లాభాలను కూడా అదే విధంగా సాధించింది. కాగా వినియోగ ఉత్పత్తుల రంగంలో ఆయుర్వేద, సహజ ఉత్పత్తులతో శరవేగంగా దూసుకుపోతున్న పతంజలి సంస్థ తాజాగా టెలికం రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్)తో చేతులు కలిపిన రాందేవ్ బాబా.. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే, తొలుత ఈ సిమ్ కార్డులు పతంజలి ఆఫీస్ బేరర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వచ్చాక కార్డు ద్వారా పతంజలి ఉత్పత్తులపై పదిశాతం రాయితీ లభిస్తుంది.

కేవలం 144 రీఛార్జ్‌తో దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్‌ చేసుకునే సౌకర్యం, 2జీబీ డేటా ప్యాక్‌, 100 ఎస్‌ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్‌ చేయనుంది.వాటితో పాటు ప్రజలకు ఈ సిమ్‌ కార్డులపై వైద్య, ప్రమాద, జీవిత బీమాలను పతంజలి అందించనుంది. తమ గుర్తింపు కార్డులను చూపించడం ద్వారా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ గార్గ్‌ వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 'స్వదేశీ నెట్‌వర్క్‌' అని ఈ సందర్భంగా రాందేవ్‌ అన్నారు. పతంజలి, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇరు కంపెనీల ఉద్దేశ్యం కూడా దేశ సంక్షేమమేనని ఆయన పేర్కొన్నారు.





Untitled Document
Advertisements