'రైతు బీమా'కు దరఖాస్తు ఎలా..!

     Written by : smtv Desk | Wed, Jun 06, 2018, 10:59 AM

'రైతు బీమా'కు దరఖాస్తు ఎలా..!

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఆవేదనను గుర్తించి వారి పంటల పెట్టుబడి కోసం రైతు బంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు రైతన్నలందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే కుటుంబానికి ఆసరాగా ఈ బీమా డబ్బులు సదరు కుటుంబానికి అందుతాయి. బీమా పరిహారం రూ.5లక్షలు కాగా.. పట్టాదారు పాసుబుక్కులు ఉన్న రైతులంతా ఈ పథకానికి అర్హులు. రైతులు 15 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు వారై ఉండాలి. 15-08-2018 నుంచి 14-08-2019 వరకు అంటే ఏడాది ఈ బీమా అమలులో ఉంటుంది. ఏడాదికోసారి బీమా పథకాన్ని రెన్యువల్ చేస్తారు.

రైతు జీవిత బీమా పథకం అమలుపై జిల్లా వ్యవసాయాధికారులు(డీఏఓ), గ్రామస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ), రైతు సమన్వయ సమితి(రైసస)ల జిల్లా, మండల స్థాయి సమన్వయకర్త కీలక పాత్ర పోషించనున్నారు.

దీని ప్రకారం బీమా కలిగిన రైతు ఏ కారణంతో మరణించినా వెంటనే ఏఈఓ సదరు గ్రామ పంచాయతీ నుండి మరణ ధ్రువీకరణ పత్రం తెచ్చి ఇస్తే పదిరోజుల్లోపు ఎల్‌ఐసీ రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. దీన్ని ఇప్పించే బాధ్యత ఏఈఓదే. ఇది జరుగుతుందా? లేదా? అన్నది రైసస మండల సమన్వయకర్త పరిశీలించాలి.

దరఖాస్తు చేయడం ఎలా..

>> ఆధార్‌కార్డులో ఉన్న జన్మదిన తేదీ ప్రకారం రైతుల వయస్సు ను కొలమానంగా తీసుకుంటారు. ఒకవేళ పుట్టిన తేదీ లేకపోతే జూలై 1ని పుట్టిన తేదీగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పట్టాదారుడి ఆధార్ నంబర్, పాసుపుస్తకం నెంబరు, మొబైల్ నెంబరు, ఒకవేళ చనిపోతే డబ్బులు ఎవరికి చెల్లించాలో తెలిపే నామిని పేరు, నామిని ఆధార్, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలతో పాటు రైతు స్వయంగా సంతకం చేయాల్సి ఉంటుంది.

>> ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్క పట్టాదారుడికి ఆగస్టు15 తర్వాత ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్ ఇస్తుంది. గురువారం నుంచి అధికారులు నామిని వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలను అన్ని మండలాల్లో ఏఈవోలు క్లస్టర్‌ల వారీగా రైతుల వద్ద సమాచారాన్ని తీసుకొంటారు.









Untitled Document
Advertisements