అప్పట్లో 18.. ఇప్పుడు 24.. భవిష్యత్తులో..?

     Written by : smtv Desk | Wed, Jun 06, 2018, 01:14 PM

అప్పట్లో 18.. ఇప్పుడు 24.. భవిష్యత్తులో..?

వాషింగ్టన్, జూన్ 6‌: చంద్రుడు భూమికి దూరమయ్యే కొద్దీ రోజు సమయం పెరుగుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు దాదాపు 140 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒకరోజుకు కేవలం 18 గంటలే ఉండేవట.. మరి ఇప్పుడు రోజుకు 24 గంటలు.. అంతేకాదండయో భవిష్యత్తులో ఈ సమయం పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా సమయం పెరగడానికి కారణం భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడేనంట.

ఒకరోజు... అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం. చంద్రుడు క్రమంగా భూమి నుంచి దూరంగా జరగడం వల్ల ఆ ప్రభావం భూమిపై పడి.. అది తనచుట్టూ తాను తిరిగే సమయం పెరుగుతోందని కొలంబియా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌-మాడిసన్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.

వారు చెబుతున్నదాని ప్రకారం.. గతంలో, అంటే దాదాపు 140 కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద ఒక రోజు అంటే 18 గంటలేనట. కాలక్రమేణా చంద్రుడు భూమికి దూరంగా జరగడంతో భూమి ఆత్మభ్రమణ వేగం తగ్గిందని వెల్లడించారు. ప్రస్తుతం చంద్రుడు భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ, స్థిరంగా అక్కడే ఉండట్లేదు. ఏడాదికి 3.82 సెంటీమీటర్ల మేర చొప్పున జరిగిపోతున్నాడు.

ఈ క్రమంలో.. చంద్రుడి గురుత్వాకర్షణ కారణంగా సముద్రంలో చెలరేగే అలలు చంద్రుణ్ని తమవైపు లాగడానికి ప్రయత్నిస్తుంటే, చంద్రుడు అంతే శక్తితో అలలను లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలా కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా జరుగుతోంది. దీనివల్ల భూమిపై రోజు పరిధి ఏడాదికి సెకనులో 74 వేలో వంతు మేర పెరుగుతోంది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు రోజుకు 24 గంటలు కాక ఇంకా ఎక్కువ సమయం ఉంటుంది. అంతే కాకుండా సౌరకుటుంబంలో భూమి గమనాన్ని సూర్యుడు, చంద్రుడితో పాటు ఇతర గ్రహాలు గణనీయంగా ప్రభావితం చేశాయని మేయర్స్‌ వెల్లడించారు.

Untitled Document
Advertisements