ఇంటర్ బోర్డు నిర్వాకం.. 'అత్త సొమ్ము అల్లుడి దానం'..

     Written by : smtv Desk | Thu, Jun 07, 2018, 11:59 AM

ఇంటర్ బోర్డు నిర్వాకం.. 'అత్త సొమ్ము అల్లుడి దానం'..

హైదరాబాద్, జూన్ 7 : చదువులే అమ్ముకుంటున్న ప్రస్తుత రోజుల్లో మేమేమి తక్కువ కాదన్నట్లు ఆయా సంస్థలు కూడా డబ్బులకు ఆశ పడి అడ్డదారులు తొక్కుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డులో అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమార్జనే పరమావధిగా కొందరు అధికారులు దారులు వెతుకుతున్నారు. అవసరం లేకపోయినా కొత్త పనులు చేపడుతూ ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. 'అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు' విద్యార్థుల ధనాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారు. అక్రమపని తీరుతో ఇంటర్‌ బోర్డు, కమిషనరేట్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు. అందులో ముఖ్యంగా పని నేర్చుకోవడానికి ఓ కంపెనీకి ఇంటర్‌ బోర్డు అధికారులు ఏకంగా రూ.55 లక్షలు అప్పగించడం విశేషం.

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 13న విడుదల చేశారు. దాంతో వార్షిక పరీక్షల తంతు పూర్తియింది. కానీ, బోర్డు అధికారులు మళ్లీ ఫలితాల ప్రాసెసింగ్‌ను మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? ఓ కంపెనీ ఫలితాల ప్రాసెసింగ్‌ ఎలా చేయాలో తెలుసుకునేందుకు..! ఓ కంపెనీకు ఏకంగా రూ.55 లక్షలు ఇవ్వడం గమనార్హం. ఫలితాల ప్రాసెసింగ్‌ను చాలా కాలం నుంచి మేగ్నటిక్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఈ పనిని గ్లోబరీనా కంపెనీకి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫలితాలు సక్రమంగా విడుదల చేసేందుకు ఈ ఏడాది ఫలితాలను మళ్లీ ప్రాసెసింగ్‌ చేయాలని కంపెనీ భావించింది. ఇందుకయ్యే ఖర్చు ఇవ్వాలని అధికారులను సంప్రదించగా.. ఎటువంటి టెండరు లేకుండానే రూ.55 లక్షలు ధారాదత్తం చేసేశారు.

ఇదే కాకుండా ఇంటర్‌బోర్డు, కమిషనరేట్‌లో నిరంతర విద్యుత్తు, ఇంటర్నెట్‌ సరఫరాకు అధికారులు ఏకంగా రూ.80లక్షలకు టెండరు అప్పగించడం, హెల్ప్‌లైన్‌ ఉండగానే కాల్ సెంటర్ ఏర్పాటు, అవసరం ఉన్నా లేకపోయినా కమీషన్ల కక్కుర్తితో బోర్డు అధికారులు విచ్చలవిడిగా టెండర్లు పిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవే కాకుండా అవసరమైన సామగ్రి ఏసీలు, కుర్చీలు, కొన్నామన్న పేరుతో భారీ ఎత్తున నగదు అడ్డదారిలో మళ్లిస్తున్నారు. ఈ చర్యల వెనుక బోర్డు పరిధిలోని నలుగురు చక్రం తిప్పుతున్నరని సమాచారం. బోర్డులో, కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న అవినీతిపై సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించాలని, టెండర్లపై ఏసీబీ విచారణ జరిపించాలని ఇంటర్‌బోర్డు జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.





Untitled Document
Advertisements