మరోసారి పేస్'బుక్కు' అయింది...!

     Written by : smtv Desk | Fri, Jun 08, 2018, 12:03 PM

మరోసారి పేస్'బుక్కు' అయింది...!

న్యూయార్క్‌, జూన్ 8 : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ పై వచ్చిన డేటా దుర్వినియోగం మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఫేస్‌బుక్‌ పై అరకొర అటువంటి వార్తలే పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి అటువంటి చిక్కులనే ఆ సంస్థ ఎదుర్కొంటుంది. ఫేస్‌బుక్‌ సాఫ్ట్‌వేర్‌లో ఇటీవల ఏర్పడిన ఓ బగ్‌ కారణంగా కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత పోస్టులు వాటంతట అవే పబ్లిక్‌గా మారాయట. స్వయంగా ఫేస్‌బుక్‌ ఈ బగ్‌ గురించి వెల్లడించింది. దీంతో ఫేస్‌బుక్‌పై యూజర్లలో మరోసారి ఆందోళన రేకెత్తుతోంది.

ఇటీవల తమ సాఫ్ట్‌వేర్‌లో ఓ బగ్‌ను గుర్తించామని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఈ బగ్‌ వ్యక్తిగత సెట్టింగ్స్‌ను మార్చేసిందని, ‘ప్రయివేటు’, ‘ఫ్రెండ్స్‌ ఓన్లీ’ అని పెట్టుకున్న పోస్టులు వాటంతట అవే పబ్లిక్‌గా మారాయని పేర్కొంది. మే నెలలో కొద్ది రోజుల పాటు ఈ బగ్‌ 1.4కోట్ల మంది యూజర్లపై ప్రభావం చూపిందని వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆ బగ్‌ను గుర్తించి, సమస్యను పరిష్కరించినట్లు స్పష్టం చేసింది.

మే 18 నుంచి మే 27 వరకు ఈ బగ్‌ ఆక్టివ్‌లో ఉన్నట్లు... అయితే అంతకుముందు పెట్టిన పోస్టులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఎప్పుడైతే బగ్‌ ఆక్టివ్‌లో ఉందో.. అప్పుడు మాత్రమే పోస్టులన్నీ పబ్లిక్‌ ఆప్షన్‌లోకి వెళ్లిపోయినట్లు సంస్థ పేర్కొంది. ఇటీవల ఫేస్‌బుక్‌ డేటా దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి 8.7కోట్ల మంది యూజర్ల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా అంగీకరించారు. తమ వల్ల పొరబాటు జరిగిందని బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements