ఎయిర్‌ ఇండియాకు షాక్ ఇచ్చిన పైలెట్లు..

     Written by : smtv Desk | Fri, Jun 08, 2018, 06:06 PM

ఎయిర్‌ ఇండియాకు షాక్ ఇచ్చిన పైలెట్లు..

న్యూఢిల్లీ, జూన్ 8 : నష్టాల ఊబిలో కూరుకుపోయిన జాతీయ ఎయిర్‌లైనర్‌ ఎయిర్‌ ఇండియాకు మరో షాక్ తగిలింది. జీతాలు సరిగ్గా ఇవ్వని కారణంగా యాజమాన్యానికి సహకరించబోమని పైలెట్స్‌ యూనియన్‌ ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌(ఐసీపీఏ) నిర్ణయించుకుంది. ఈ మేరకు ఐసీపీఏ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (సీఈసీ), రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(ఆర్‌ఈసీ) ఎయిరిండియా యాజమాన్యానికి లేఖ రాసింది. ఎయిర్‌ ఇండియా మూడు నెలలుగా 11,000 మంది ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో అలసత్వం ప్రదర్శిస్తోంది. జీతాలను సక్రమంగా చెల్లిస్తూ ఎయిర్‌లైన్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ యాజమాన్యంతో సహకరించే ప్రసక్తి లేదని భారత వాణజ్య పైలెట్ల అసోసియేషన్‌ కేంద్ర కార్యవర్గ కమిటీకి రాసిన లేఖలో ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఆర్‌ఈసీ) స్పష్టం చేసింది.

"సరైన సమయానికి వేతనాలు ఇవ్వనందున సంస్థ యాజమాన్యానికి మేమందరం సహకరించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. కనీసం వేతనాలు ఆలస్యమవుతాయని సంస్థ ముందస్తుగా ఎటువంటి హెచ్చరికలు చేయలేదు. దీనివల్ల మేమంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే యాజమాన్యానికి సహకరించకూడదని ఆర్‌ఈసీ నిర్ణయించుకుంది. ఎటువంటి ఆలస్యం లేకుండా సరైన సమయానికి వేతనాలు ఇచ్చేంత వరకూ మేం ఇలాగే కొనసాగుతాం" అని ఆర్‌ఈసీ లేఖలో వెల్లడించింది.





Untitled Document
Advertisements