'ట్రంప్' రితనం..

     Written by : smtv Desk | Sun, Jun 10, 2018, 01:41 PM

'ట్రంప్' రితనం..

కెనడా, జూన్ 10 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను కెనెడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. దీంతో జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు అసంతృప్తిగా ముగిసింది. ట్రూడో వైఖరిపై మండిపడ్డ ట్రంప్‌ అమెరికాలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్‌ వస్తువులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. జీ7 దేశాల సంయుక్త ప్రకటన నుంచి కూడా అమెరికా దూరంగా ఉంటున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. ట్రూడో బహిరంగంగా యూఎస్‌ వాణిజ్య విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో జీ7 సదస్సు సంయుక్త ప్రకటనకు మద్దతు ఉపసంహరించుకోవాలని తన అధికారులకు శనివారం ట్రంప్‌ సూచించారు.

"మీడియా కాన్ఫరెన్స్‌లో ట్రూడో ఆవాస్తవాలు చెప్పారు. నిజమేంటంటే అమెరికా రైతులు, కంపెనీలు, కార్మికులను ఇబ్బందులకు గురిచేసేలా కెనడా భారీ సుంకాలను విధిస్తోంది. దీంతో అమెరికాలో దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్‌పై సుంకాలను పరిశీలిస్తున్నాం. సంయుక్త ప్రకటనకు మద్దతు ఇవ్వొద్దని నేను అమెరికా ప్రతినిధులను ఆదేశిస్తున్నాను" అని ట్రంప్‌ సదస్సును వదిలి వెళ్తూ ట్వీట్‌ చేశారు.

యూరోపియన్‌ యూనియన్‌, కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ట్రూడో వ్యతిరేకించారు. కెనడీయన్లు మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా ఉంటారని.. అయితే వారిని ఇబ్బందిపెడితే సహించబోరని ట్రూడో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అన్నారు.





Untitled Document
Advertisements