ప్రణబ్ రాజకీయ పునఃప్రవేశం ఉండదు : శర్మిష్ఠ ముఖర్జీ

     Written by : smtv Desk | Sun, Jun 10, 2018, 05:41 PM

ప్రణబ్ రాజకీయ పునఃప్రవేశం ఉండదు : శర్మిష్ఠ ముఖర్జీ

ముంబై, జూన్ 10 : మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన వేడుకకి ముఖ్య అతిథిగా వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆయనపై ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో భాజపాకు తగిన ఆధిక్యం రాకపోతే ప్రధాని పదవిని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కట్టబెట్టే విషయంలో ఏకాభిప్రాయం కుదరవచ్చని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు శనివారం తన పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం కూడా రాసింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణబ్‌ను ఆహ్వానించినట్లు పేర్కొంది. నాగ్‌పూర్‌లో ప్రణబ్‌ చేసిన ప్రసంగం భాజపాకు వచ్చే ఎన్నికల్లో మద్దతిచ్చేలా ఉందని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ శనివారం వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా గా శర్మిష్ఠ ట్వీట్‌ చేశారు.

ఈ వ్యాఖ్యలపై శర్మిష్ఠ స్పందిస్తూ.. ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ పునఃప్రవేశం ఉండబోదని ఆమె ఆదివారం స్పష్టం చేశారు. శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ను ఉద్దేశించి ఆమె ఆదివారం ట్వీట్‌ చేశారు. "మిస్టర్‌ సంజయ్‌ రౌత్‌.. భారత రాష్ట్రపతిగా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకూ నా తండ్రి రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొనలేదు. ఇకపై ఆయన రాజకీయ పునఃప్రవేశం ఉండదు" అని ట్వీట్‌ చేశారు.





Untitled Document
Advertisements