'పెన్ను దొంగలిస్తే ఉరిశిక్ష వేసినట్లున్నది' మీ తీరు...

     Written by : smtv Desk | Mon, Jun 11, 2018, 04:31 PM

'పెన్ను దొంగలిస్తే ఉరిశిక్ష వేసినట్లున్నది' మీ తీరు...

హైదరాబాద్‌, జూన్ 11 : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్‌ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ మధుసూదనాచారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయస్థానం తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ రేవంత్‌రెడ్డి నిలదీశారు. ‘పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్లు’గా మీ వైఖరి ఉందంటూ స్పీకర్‌ను గట్టిగా నిలదీశారు. రేవంత్‌ వ్యాఖ్యలతో చిన్నబుచ్చుకున్న స్పీకర్‌.. మీరు ఇలా మాట్లాడితే వెళ్లిపోతానని అన్నారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్‌రెడ్డిని వారించారు.

తర్వాత కాంగ్రెస​ నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌, అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని​ స్పీకర్‌కు సలహాలు ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్‌ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు.





Untitled Document
Advertisements