ఆ భేటీ 'టాక్‌ ఆఫ్‌ ది సెంచరీ' : దక్షిణకొరియా

     Written by : smtv Desk | Tue, Jun 12, 2018, 03:49 PM

ఆ భేటీ 'టాక్‌ ఆఫ్‌ ది సెంచరీ' : దక్షిణకొరియా

సియోల్‌, జూన్ 12 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు తటస్థ వేదికగా సమావేశం కావటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా కారాలు-మిరియాలు నూరుకుంటూ.. అసభ్యంగా తిట్టుకున్న వీరిద్దరూ... ఇప్పుడు ఆప్యాయంగా పలకరించుకున్న వైనం ఆకట్టుకుంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా భేటీని తిలకించింది. ఈ చారిత్రాత్మక భేటీ ‘టాక్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అని దక్షిణకొరియా మీడియా అభివర్ణించింది. ఈ సమావేశంపై ఆ దేశ అధ్యక్షుడు మూన్‌ జైన్‌ స్పందించారు. అద్భుతమైన సమావేశమని ఆయన కొనియాడారు. దీని ద్వారా శాంతి స్థాపనలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"ట్రంప్‌-కిమ్‌ భేటీ విజయవంతమైందని నమ్ముతున్నాను. అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనలో నూతన శకం ఆరంభమవుతోంది" అని మూన్‌ వ్యక్తం చేశారు. సమావేశంపై ఉన్న ఆసక్తి వల్ల మూన్‌ రాత్రంతా నిద్రలేకుండా గడిపారని ఆయన అధికారవర్గాలు వెల్లడించాయి. దక్షిణకొరియా ప్రజలంతా ఎక్కడిక్కడ టీవీలకు అతుక్కుపోయారు. సియోల్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన టెలివిజన్‌లో ట్రంప్‌-కిమ్‌ భేటీని సియోల్‌ వాసులు వీక్షించారు. ఇరు దేశాధ్యక్షులు కరచాలనం చేసుకోగానే టీవీ చూస్తున్న వారంతా బిగ్గరగా కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.





Untitled Document
Advertisements