'వేర్‌ ఇజ్‌ సింగపూర్‌ ఇన్‌ ది వరల్డ్‌'..

     Written by : smtv Desk | Tue, Jun 12, 2018, 05:49 PM

'వేర్‌ ఇజ్‌ సింగపూర్‌ ఇన్‌ ది వరల్డ్‌'..

సింగపూర్‌, జూన్ 12 : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్‌ - కిమ్‌ల సమావేశం సింగపూర్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో నెటిజన్లు, ముఖ్యంగా అమెరికన్లు గూగుల్‌ను ప్రశ్నలతో వేధించారు. అసలు ఈ సింగపూర్ ఎక్కడుంది అన్న ప్రశ్నను ఎక్కువ మంది అడిగారట. గత 24 గంటల్లో ఇదే ఎక్కువగా అడిగిన ప్రశ్న అని గూగుల్ అనలిటిక్స్ వెల్లడించింది.

ఈ ఇద్దరు అధ్యక్షుల భేటీ నేపధ్యంలో అమెరికా ప్రజలు గూగుల్‌లో ఎక్కువగా సర్చ్‌ చేసింది దేని గురించో తెలుసా...?‘వేర్‌ ఇజ్‌ సింగపూర్‌ ఇన్‌ ది వరల్డ్‌?’(ప్రపంచంలో సింగపూర్‌ ఎక్కడుంది?). వీరిద్దరి భేటీ గురించి ప్రకటించిన తర్వాత చాలా మంది అమెరికన్స్‌ సింగపూర్‌ గురించే తెగ వెతికేశారట. దాంతో పాటు ‘ఉత్తర కొరియా ఎక్కడుంది?’, ‘సింగపూర్‌ చైనా లేదా జపాన్‌లో భాగమా?’ లేదా ‘సింగపూర్‌ స్వయంగా ఒక దేశమా..?’ వంటి పలు ఆసక్తికర అంశాల గురించి శోధించారట. కేవలం సింగపూర్‌ గురించే కాక మరికొందరు కిమ్‌ గురించి కూడా సెర్చ్ చేసారంట. ‘కిమ్‌ ఎత్తు ఎంత..?’, ‘కిమ్‌ ఇంగ్లీష్‌ మాట్లడగలడా...?’ అంటూ సర్చ్‌ చేసారు.

ట్రంప్‌ - కిమ్‌లు ఇద్దరు సింగపూర్‌లోని సెంటసోలోని కెపెల్లా ద్వీపంలో మంగళవారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 48 నిమిషాల పాటు ట్రంప్‌ - కిమ్‌ మధ్య చర్చలు జరిగాయి. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని ట్రంప్‌ కిమ్‌కు సూచించారు. ఇందుకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని, దీనితోపాటు ఆర్థిక సాయం అందిస్తానని ట్రంప్‌ అన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





Untitled Document
Advertisements