ధర్నా కాదు.. సర్జికల్‌ స్ట్రైక్‌..

     Written by : smtv Desk | Wed, Jun 13, 2018, 04:06 PM

ధర్నా కాదు.. సర్జికల్‌ స్ట్రైక్‌..

ఢిల్లీ, జూన్ 13 : ఢిల్లీ రాష్ట్ర హక్కులను కేంద్రం లాగేసుకుంటోందంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఇంటి వద్ద సోమవారం సాయంత్రం మెరుపు ధర్నా.. బైఠాయింపునకు దిగిన ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత కేజ్రీవాల్‌.. మంగళవారం కూడా అక్కడే గడిపారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రజలకు తమ పోరాటానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ట్విటర్‌లో వీడియోల ద్వారా షేర్ చేశారు. తాము చేస్తున్న ధర్నాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రులు మండిపడుతున్నారు.

తమ డిమాండ్లను కేంద్రం, ఎల్జీ ఆమోదించాలంటూ మంత్రి సత్యేంద్ర జైన్‌ నిన్నటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టారు. నేడు ఆయనకు తోడుగా మరో మంత్రి మనీశ్‌ సిసోడియా ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. ప్రజాసేవలను నిలిపివేసిన వారికి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజల తరఫున మేం పోరాటం చేస్తున్నాం. మీరు దీన్ని ధర్నా అనుకోవచ్చు. కానీ ఇది నా సర్జికల్‌ స్ట్రైక్‌’ అని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి సిసోడియా పేర్కొన్నారు. ఓ ఆంగ్ల వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారులు గత మూడు నెలలుగా కేవలం ఆఫీసులకు వచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని.. ఢిల్లీలో నెలకొన్న ప్రజల సమస్యల గురించి సంబంధిత మంత్రులతో సమావేశాల్లో పాల్గొనడం లేదని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

కొన్ని నెలలుగా ఐఏఎస్‌ అధికారులు విధులు బహిష్కరించడం వల్ల దిల్లీలో పరిపాలన స్తంభించిందని.. దీనిపై పలుమార్లు ఎల్జీకి ఫిర్యాదు చేసినా ఆయన నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కేజ్రీవాల్‌, ఆయన మంత్రులు మెరుపు ధర్నాకు దిగారు. అయితే అకారణంగా కేజ్రీవాల్‌, ఆయన సహచరులు కార్యాలయంలో బైఠాయింపునకు దిగినట్లు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.





Untitled Document
Advertisements