అమెరికన్‌ మీడియా పై మండిపడ్డా ట్రంప్..

     Written by : smtv Desk | Thu, Jun 14, 2018, 04:20 PM

అమెరికన్‌ మీడియా పై మండిపడ్డా ట్రంప్..

వాషింగ్టన్‌, జూన్ 14 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు తటస్థ వేదికగా సమావేశం కావటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా కారాలు-మిరియాలు నూరుకుంటూ.. అసభ్యంగా తిట్టుకున్న వీరిద్దరూ... ఇప్పుడు ఆప్యాయంగా పలకరించుకున్న వైనం ఆకట్టుకుంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా భేటీని తిలకించింది. ఈ చారిత్రాత్మక భేటీ ‘టాక్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అని దక్షిణకొరియా మీడియా అభివర్ణించింది. కాగా ఈ చారిత్రాత్మక భేటీ గురించి అమెరికన్‌ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసిందంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు.

సింగపూర్‌ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ట్విటర్‌ వేదికగా మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. భేటీ అనంతరం అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సమ్మతించిన నేపథ్యంలో భారీ అణు విపత్తునుంచి ప్రపంచం ఒక అడుగు వెనక్కు వేయగలిగిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై కొందరు 'నిపుణులు' అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

"ముఖ్యంగా ఎన్‌బీసీ, సీఎన్‌ఎన్‌ వంటి మీడియా సంస్థలు ప్రచారం చేసే నకిలీ వార్తలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఉత్తర కొరియాతో జరిగిన ఒప్పందం గురించి తక్కువ చేసి చూపించడానికి వారు ఎంతో కష్టపడ్డారు. .. ఈ ఒప్పందం జరగాలంటూ 500 రోజుల క్రితం ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందా అన్న స్థాయిలో గగ్గోలు పెట్టిన వారే ఇప్పుడు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారే మన దేశానికున్న అతిపెద్ద శత్రువులంటూ" ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.













Untitled Document
Advertisements