అమెరికా- చైనా మధ్య టారిఫ్ వార్..

     Written by : smtv Desk | Sat, Jun 16, 2018, 05:27 PM

అమెరికా- చైనా మధ్య టారిఫ్ వార్..

బీజింగ్‌, జూన్ 16 : అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య మళ్లీ టారిఫ్ వార్ మొదలైంది. నువ్వా-నేనా అన్నట్లుగా ఇరు దేశాలు పరస్పరం పలు వస్తువులపై సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. శుక్రవారం చైనా నుంచి దిగుమతి అయ్యే 50బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై 25శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా కూడా అదే మొత్తానికి సమానమైన ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 50 బిలియన్‌ డాలర్ల విలువ చేసే సుమారు 659 అమెరికా వస్తువులపై 25శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశానికి చెందిన న్యూస్‌ ఏజెన్సీ జిన్హువా వెల్లడించింది. ఏయే పదార్థాలపై సుంకం విధిస్తున్నారనే దానికి సంబంధించిన జాబితాను కూడా చైనా విడుదల చేసింది.

"34బిలియన్‌ డాలర్ల విలువ చేసే 545 వస్తువులపై 25శాతం సుంకాన్ని విధిస్తున్నాం. వీటిలో వ్యవసాయ రంగ ఉత్పత్తులు, వాహనాలు, అక్వాటిక్‌ ప్రొడక్ట్స్‌ ఉన్నాయి. జులై 6, 2018 నుంచి ఈ అదనపు సుంకాన్ని వసూలు చేస్తాం" అని చైనా కస్టమ్స్‌ టారిఫ్స్‌ కమిషన్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇక మిగతా 114 వస్తువులైన రసాయనిక పదార్థాలు, వైద్య పరికరాలు, ఎనర్జీ ప్రొడక్ట్స్‌తో పాటు పలు ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. చైనాను కవ్విస్తూ అమెరికా టారిఫ్‌లు విధించడం, అమెరికాకు ప్రతిగా చైనా చర్యలు తీసుకోవడం మరింత వాణిజ్య యుద్ధానికి పురిగొల్పుతోంది.





Untitled Document
Advertisements