హస్తంతో పొత్తు లేదంటున్న బీఎస్పీ..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 12:41 PM

హస్తంతో పొత్తు లేదంటున్న బీఎస్పీ..

భోపాల్, జూన్ 18 ‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో కూడా పాగా వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విపక్షాలు ఉమ్మడిగా రాష్ట్రాల్లో బీజేపీను ఎదుర్కోవాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బహుజన‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేస్తాయని వస్తున్న వార్తలను బీఎస్పీ ఖండించింది. దీంతో భాజపాను ఓడించేందుకు విపక్షాలు సమష్టిగా పోటీ చేయాలనే ప్రతిపాదనలకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీఎస్పీ పొత్తుతో పోటీ చేస్తాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే పొత్తు విషయంపై కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయనే వార్తలను బీఎస్పీ ఖండించింది. ఎలాంటి చర్చలు జరపట్లేదని, ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారమైతే బీఎస్పీ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతుందని సీనియర్‌ బీఎస్పీ నేత ఒకరు వెల్లడించారు.

"వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు విషయంపై సంప్రదింపులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారని మీడియా నన్ను అడిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో అలాంటి సంప్రదింపులేమీ జరగడం లేదని స్పష్టం చేశాను. కేంద్ర స్థాయిలో కూడా చర్చలు జరగట్లేవని భావిస్తున్నా. ఈరోజు వరకున్న పరిస్థితుల ప్రకారం బీఎస్పీ రాష్ట్రంలోని అన్ని 230 స్థానాల్లో పోటీ చేస్తుంది. పొత్తు విషయంపై కేంద్ర నాయకత్వం నుంచి నాకు ఎలాంటి సూచనలు అందలేదు" అని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు నర్మదా ప్రసాద్‌ అహివార్‌ వెల్లడించారు.








Untitled Document
Advertisements