ఫిఫాలో భారతీయ విద్యార్ధి ..

     Written by : smtv Desk | Tue, Jun 19, 2018, 11:57 AM

ఫిఫాలో భారతీయ విద్యార్ధి ..

సోచి, జూన్ 19 : రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఇండియా తరుపున ఓ విద్యార్ధి ప్రాతినిధ్యం వహించాడు. అదేంటి ఈ పోటీల్లో భారత్‌ పాల్గొనడం లేదు కదా. మరి ఎలా అని ఆలోచిస్తున్నారా. టోర్నీలో భాగంగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అధికారిక బంతిని పాఠశాల విద్యార్థులు మైదానంలోకి తీసుకువస్తారు. ఇందుకుగాను ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో భారత్‌కు చెందిన రిషి తేజ్‌, నతనియా జాన్‌ ఉన్నారు. టోర్నీలో భాగంగా సోమవారం బెల్జియం-పనామా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రిషి తేజ్‌ అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువచ్చాడు.

ఫిఫా ప్రపంచకప్‌లో ఇలా అధికారిక బంతిని మైదానంలోకి తీసుకువెళ్లిన తొలి భారతీయుడిగా రిషి చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ... 'ఈ సమయంలో నేను ఎంతో ఆనందానికి గురయ్యాను. ఇప్పటికీ నేను ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నాను. మ్యాచ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేయలేదు. ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న దానిపై దృష్టి పెట్టా. ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచకప్‌ కోసం రష్యా వెళ్లడానికి ముందు వారం రోజులపాటు నాకు నిద్రపట్టలేదు' అని రిషి వెల్లడించాడు.

కర్ణాటకకు చెందిన రిషి తేజ్‌కు పదేళ్లు. ఇక రెండో విద్యార్థి నతనియా జాన్‌ తమిళనాడుకు చెందినవాడు. ఈ నెల 22న బ్రెజిల్‌-కోస్టారికా మధ్య జరిగే మ్యాచ్‌కు జాన్‌ బంతిని అందివ్వనున్నాడు. ఈ ప్రపంచకప్‌లో బలమైన జట్లలో ఒకటైన బెల్జియం పనామాపై 3-0తో విజయం సాధించింది.










Untitled Document
Advertisements