కశ్మీర్ తో కటీఫ్‌.. తర్వాత కార్యాచరణ ఏంటి..!

     Written by : smtv Desk | Tue, Jun 19, 2018, 07:23 PM

కశ్మీర్ తో కటీఫ్‌.. తర్వాత కార్యాచరణ ఏంటి..!

శ్రీనగర్, జూన్ 19 : జమ్మూ కాశ్మీర్‌లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించిన విషయం తెలిసిందే. కాషాయదళం వైదొలగడంతో ప్రస్తుతం కశ్మీర్‌లోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో సీఎం మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం తననేమీ షాక్‌కు గురి చేయలేదని ఆమె అన్నారు. పొత్తు కొనసాగించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించామని కానీ కుదరలేదని ముఫ్తీ వెల్లడించారు.

పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకోవడంతో జమ్ము కశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ స్పష్టం చేయడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని ముఫ్తీ చెప్పడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

గతంలో జమ్ముకశ్మీర్‌లో 7 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది సభ్యుల మద్దతు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. ఇందులో పీడీపీకి 28 మంది, బీజేపీకి 25 మంది, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15 మంది, కాంగ్రెస్‌కు 12 మంది సభ్యులుండగా.. 7 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.

రాష్ట్రపతి పాలనలోకి వెళ్లకుండా ఉండాలంటే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ మెజారిటీకి సరికొత్త సంకీర్ణం అవసరమవుతుంది. పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ అలయెన్స్), ఎన్‌సీ (నేషనల్ కాంగ్రెస్) పొత్తే తక్షణ పరిష్కారంగా కనిపిస్తోంది. గతానుభవాల నేపథ్యంలో మోహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ లేకపోతే.. అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తారు. అప్పుడు గవర్నర్ నేతృత్వంలో పాలన కొనసాగిస్తారు. బీజేపీ కూడా ఇదే ఆశిస్తుంది.





Untitled Document
Advertisements