ఉగ్రవాదుల వేట షూరు..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 02:28 PM

ఉగ్రవాదుల వేట షూరు..

శ్రీనగర్, జూన్ 22 ‌: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల వేట మొదలైంది. రంజాన్‌ అనంతరం కాల్పుల విరమణ ముగిసినట్లు కేంద్రం ప్రకటించటం, ఆ తర్వాత కశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుండి బీజేపీ వైదొలగడం.. దీంతో అక్కడ గవర్నర్ పాలన విధించిన విషయం తెలిసిందే. తదనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు కశ్మీర్‌లో పాగా వేశాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అనంతనాగ్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. నలుగురు ఉగ్రవాదులను బలగాలు సంహరించాయి. జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన ప్రారంభమైన తర్వాత ఇదే మొదటి ఎన్‌కౌంటర్.

అనంతనాగ్‌లోని శ్రీగుఫ్‌వరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఈరోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు తిప్పికొట్టేందుకు ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిపైకి స్థానిక యువకులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్‌, అనంతనాగ్‌లలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. ఇస్లామిక్‌ స్టేట్‌ జమ్ము కశ్మీర్‌ (ఐఎస్‌జేకే) సంస్థ చీఫ్‌తోపాటు ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఎన్‌కౌంటర్‌ విషయాన్ని డీజీపీ శేష్‌పౌల్‌ వైద్‌ ట్విట్టర్‌ ద్వారా ధృవీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Untitled Document
Advertisements