కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మోదీ.

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 05:58 PM

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మోదీ.

రాజ్‌గఢ్‌‌, జూన్ 23 : ప్రధాని నరేంద్రమోదీ విపక్ష పార్టీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆ పార్టీ ఆరితేరిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల మనస్సుల్లో అయోమయం, నిరాశావాదం సృష్టించి లబ్ధి పొందాలని భావిస్తోందని మోదీ విమర్శించారు. అయితే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమ భాజపా ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో మోహన్‌పుర వ్యవసాయ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.." ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేయడం, వారిలో అయోమయం సృష్టించే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ ప్రజల కష్టాన్ని అర్ధం చేసుకోలేదు. గత నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ నిరాశ, ఆందోళనల గురించి తాము మాట్లాడలేదని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన ప్రభుత్వం మాదే. కేంద్రంలో నాలుగేళ్లు, మధ్యప్రదేశ్‌లో 13 ఏళ్లపాటు భాజపా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోంది. పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం" అని మోదీ స్పష్టం చేశారు.

"గతంలో ఇక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్‌ బిమారూ రాష్ట్రంగా పిలిచేవారని గుర్తు చేశారు. బీఐఎంఏఆర్‌యూ(బీమారూ) అంటే బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల మొదటి అక్షరమాలతో పిలిచేవారు. అంటే వెనుకబడిన రాష్ట్రాలు అనే అర్థంలో వాడేవారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి ఆ ట్యాగ్‌ను తొలిగించిది" అని మోదీ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements