ఆ సీఐ రూటే సప 'రేటు'..

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 01:12 PM

ఆ సీఐ రూటే సప 'రేటు'..

హైదరాబాద్, జూన్ 24 : ప్రభుత్వ అధికారుల్లో లంచం ఇవ్వనిదే ఏ పని కాదు అని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఎంత మంది అవినీతి కేసుల్లో కూరుకుపోయిన మిగతా అధికారుల్లో భయం లేకుండా పోయింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు నేరాలను తగ్గించి నేరస్థులలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ స్నేహపూర్వక పోలీసింగ్‌ కొనసాగిస్తుండగా నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇతర జిల్లాలో పని చేసి, రాజకీయ నాయకుడి సిఫారసు లేఖతో వచ్చిన అధికారి ఎవర్నీ లెక్క చేయడం లేదు. కేసు నమోదైతే చాలు.. డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఫిర్యాదు చేస్తే కేసును సైతం తారుమారు చేసేస్తాడు. కేసుల విచారణ సైతం సరిగ్గా చేయడంలేదనే ఆరోపణలున్నాయి. తనకు ఎదురులేదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు.

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కేసులో సుమారు రూ.1 లక్ష వరకు లంచం పుచ్చుకున్నాడు. ఉద్యోగి తండ్రిని బెదిరించి ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ ఉంది. దీని ప్రకారం ఈ కేసులో నిన్ను కూడా బాధ్యున్ని చేసి జైలుకు పంపిస్తానని బెదిరించడంతో ఆ వ్యక్తి ఎస్‌హెచ్‌వోకు డబ్బులు సమర్పించుకున్నాడు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో తిరిగి ఆ వ్యక్తికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ఇలా పలు కేసులను తారుమారు చేస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు ఆ అధికారిని పిలిచి క్లాస్ తీసుకున్నప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయాలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి, అధికారిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని పలువురు వేడుకుంటున్నారు.

Untitled Document
Advertisements