బీజేపీ నేతలపై మండిపడ్డ దేవినేని..

     Written by : smtv Desk | Mon, Jun 25, 2018, 12:11 PM

బీజేపీ నేతలపై మండిపడ్డ దేవినేని..

అమరావతి, జూన్ 25 : ప్రాజెక్టుల నిధులు, విభజన హామీలను గురించి చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని.. గల్లీలో కాదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బీజేపీ నేతలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి అవాస్తవాలను మాట్లాడిన బీజేపీ నేతలు నిజాలు తెలుసుకొని స్పందించాలని హితవు పలికారు. బీజేపీ నేతలు తమ అతి తెలివితేటల్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చూపించుకోవాలని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 55.73 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నిధులు సకాలంలో ఇవ్వకపోయినా.. ప్రాజెక్టు నిర్మాణం ఆగకూడదన్న లక్ష్యంతో అప్పులు తెచ్చి మరీ నిర్మిస్తున్నామని చెప్పారు.

దీనికోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయల వడ్డీలను కడుతోందని తెలిపారు. ప్రతిపక్షాలు దండగ అని విమర్శించిన అన్ని ప్రాజెక్టులకూ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయన్నారు. టీడీపీ ప్రభుత్వాన్నిదూషిస్తున్న బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు ఇతర రాష్ట్రాల్లోని జాతీయ ప్రాజెక్టులను పరిశీలించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ముంపు మండలాలను సాధించకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేదే కాదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రగతిని చూడలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నేత జగన్ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్‌లు చేస్తున్నారని హేళన చేశారు.





Untitled Document
Advertisements