అదే ఫామ్.. అదే ఆట..

     Written by : smtv Desk | Fri, Jun 29, 2018, 01:59 PM

అదే ఫామ్.. అదే ఆట..

కింగ్‌ సిటీ, జూన్ 29 : బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా మాజీ సారథి స్మిత్‌పై ఏడాది నిషేధం విధించడంతో గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టీవ్‌ స్మిత్‌ తిరిగి దేశ ప్రజల నమ్మకాన్ని గెలిచేందుకు కృషి చేస్తున్నాడు. దీనిలో భాగంగా కెనడాలో జరుగుతున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరపున స్మిత్‌ పాల్గొంటున్నాడు. ఈ మేరకు గురువారం జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌(61; 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌ లాగా కెనడాలో గ్లోబల్‌ టీ20 పేరిట ఓ లీగ్‌ ప్రారంభించారు. ఈ లీగ్‌లో టొరొంటో నేషనల్స్‌ జట్టు స్మిత్‌ను దక్కించుకుంది. టోర్నీలో భాగంగా గురువారం టొరొంటో నేషనల్స్‌-వాంకోవర్‌ నైట్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనలో నేషనల్స్‌ జట్టు ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్‌ 41 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఏపీ డెవిసిచ్‌(92; 44 బంతుల్లో) కూడా రాణించడంతో నేషనల్స్ జట్టు విజయం సాధించింది.

చాలా కాలం తర్వాత బ్యాట్‌పట్టిన స్మిత్‌ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో చురుకుగా కదులుతూ కనిపించాడు. అర్ధశతకంతో రాణించాడు. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమల ద్వారా ఈ మ్యాచ్‌లో స్మిత్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ ‘స్మిత్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.





Untitled Document
Advertisements