బ్యాంకింగ్ రంగంలోకి ఎల్‌ఐసీ..!

     Written by : smtv Desk | Sat, Jun 30, 2018, 01:36 PM

బ్యాంకింగ్ రంగంలోకి ఎల్‌ఐసీ..!

ముంబై, జూన్ 30 : బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్‌ఐసీ చిరకాల స్వప్నం వాంఛ నెరవేరనున్నది. భారీ రుణ భారంతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఐఆర్‌డీఏఐ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. వాటా కొనుగోలు జరగాల్సి ఉంది. బ్యాంకులో నియంత్రణ వాటా కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీ రూ.10,000-13,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది" అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఏ కంపెనీలోనూ 15 శాతం వాటాకు మించి కొనుగోలు చేసేందుకు ఏ బీమా సంస్థకూ అనుమతి లేదు. ఇప్పుడు మాత్రం ఎల్‌ఐసీకి ఇందుకు ఐఆర్‌డీఏఐ మినహాయింపు ఇచ్చిందని సమాచారం. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించాల్సి ఉంది.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎల్‌ఐసీకి పోటీగా ఉన్న బీమా సంస్థలకు సొంత బ్యాంకులున్నాయి. కానీ 5 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాలున్నా, సొంతగా నియంత్రణ హక్కు కలిగిన బ్యాంక్‌ లేదనేదే ఎల్‌ఐసీ భావన. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 9.98 శాతం, అలహాబాద్‌ బ్యాంకులో 12.37 శాతం, కార్పొరేషన్‌ బ్యాంకులో 13.03 శాతం వాటాలు ఎల్‌ఐసీకి ఉన్నాయి. ‘ఒక బ్యాంకుపై నియంత్రణ వాటా లభిస్తే, అది మీ అనుబంధ సంస్థ అవుతుంది. మీరు ఒక బ్యాంక్‌ను కలిగి ఉన్నపుడు, మరే ఇతర బ్యాంకుల్లో 5 శాతానికి మించి వాటాలు కలిగి ఉండకూడదు. అందువల్ల ప్రత్యేక మినహాయింపు ఏమీ పొందకపోతే, మిగిలిన బ్యాంకుల్లో వాటాను తప్పనిసరిగా ఎల్‌ఐసీ తగ్గించుకోవాల్సి వస్తుంది’ అని అధికార వర్గాలు తెలిపాయి. ఐడీబీఐ బ్యాంకుతో ఒప్పందం ఖరారవగానే, బ్యాంకు బోర్డులో ఎల్‌ఐసీ ప్రతినిధులు చేరతారు.





Untitled Document
Advertisements