నీరవ్ మోదీకు షాక్.. రెడ్‌కార్నర్‌ నోటీసు

     Written by : smtv Desk | Mon, Jul 02, 2018, 11:31 AM

నీరవ్ మోదీకు షాక్.. రెడ్‌కార్నర్‌ నోటీసు

ఢిల్లీ, జూలై 2 : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును నిలువునా ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై ఎట్టకేలకు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అయింది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని నీరవ్‌పై ఇంటర్‌పోల్‌ ఈ నోటీసు జారీ చేసింది. విదేశాలకు చెక్కేసి తలదాచుకుంటున్న నిందితులను అరెస్టు చేసేందుకు ఈ రెడ్‌కార్నర్‌ నోటీసు ఉపయోగపడుతుంది. ఈ నోటీసుల జారీతో విదేశాల్లో నక్కిన నీరవ్‌ మోదీని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

ఇంటర్‌పోల్‌కు చెందిన 192 దేశాల పోలీసులు ఎవరైనా ఇతన్ని అరెస్ట్‌ చేయవచ్చు. ఒక్కసారి నీరవ్‌ మోదీ అరెస్ట్‌ అయితే, అతన్ని తమకు అప్పగించమని భారత్‌ కోరవచ్చు. నీరవ్‌ కేసులో సీబీఐ ఇప్పటికే ముంబయిలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్లను దాఖలు చేసింది. నీరవ్‌మోదీ, మెహుల్‌ ఛోక్సీ, నీరవ్‌ సోదరుడు నిషాల్‌లపై ఇంటర్‌పోల్‌ ద్వారా సీబీఐ ఫిబ్రవరి 15న డిఫ్యూజన్‌ నోటీస్‌ను జారీ చేసింది. ఈ నోటీసు ద్వారా నిందితుడు ఏ ప్రదేశంలో ఉన్నాడనే సమాచారాన్ని ఇంటర్‌పోల్‌ సభ్యదేశాలు పంచుకుంటాయి.

నీరవ్‌ మోదీ, అతని సన్నిహితులు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్‌బీ) దాదాపు రూ. 13 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా స్కాం చేసి దక్కించుకున్న నగదును, మనీ లాండరింగ్‌ ద్వారా విదేశాలకు తరలించాడు. పీఎన్‌బీ ఈ కేసును వెలుగులోకి బట్టబయలు చేస్తుందనే క్రమంలో మోదీ, అతని సన్నిహితులు జనవరిలో దేశం విడిచి పారిపోయారు. ఇప్పటి వరకు నీరవ్‌ ఎక్కడ ఉన్నాడన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.





Untitled Document
Advertisements